Andhrapradesh govt released funds to Navayuga construction company regarding Polavaram works. But still works not yet started full fledgedly.
ఆంధ్రప్రదేశ్ కలల ప్రాజెక్టు పోలవరం విషయంలో అంతా గందరగోళమే. ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలే తప్పించి.. నిజంగా అక్కడ ఏం జరుగుతోందన్న దానిపై క్లారిటీ లేదు. ఇక నిధుల సంగతి సరే సరి.. శ్వేతపత్రం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తే.. ఇంతకుముందే వెబ్‌సైట్‌లో పెట్టాం చూసుకోండి అని పొడిపొడి సమాధానాలు చెప్పేశారు. ఇక కొత్తగా పోలవరంలో కాంట్రాక్టు దక్కించుకున్న నవయుగ కంపెనీ విషయంలో ఏపీ ప్రభుత్వ తీరుపై అప్పుడే విమర్శలు మొదలయ్యాయి.
పోలవరం ప్రాజెక్టులో స్పిల్ వే, స్పిల్ ఛానల్ కాంక్రీటు మట్టి పనులు పాత కాంట్రాక్టరుతో పూర్తయ్యే అవకాశం లేదని భావించిన చంద్రబాబు సర్కార్.. ఆ పనులను నవయుగ కన్‌స్ట్రక్షన్స్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం అంచనా వ్యయం పెరిగిందని కేంద్రం ముందు ప్రతిపాదన పెడితే.. పాత ధరలకే పనులు చేయించే కాంట్రాక్టరును వెతకాలని అప్పట్లో ఆదేశాలు వచ్చాయి. ఆ మేరకు నవయుగ ముందుకు రావడంతో ఆ కంపెనీకే కాంట్రాక్టు దక్కింది.
తాజాగా ఇంజనీర్ల నివేదికలో పొందుపరిచిన ప్రకారం.. నవయుగకు కాంట్రాక్టు ఇచ్చారు కానీ పనుల విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. పాత కాంట్రాక్టర్ నుంచి పనులను వేరు చేసి ఇవ్వడమనే ప్రక్రియ ఇంకా సాంకేతికంగా జరగలేదని చెబుతున్నారు.