Congress leaders Komatireddy Venkat Reddy and Sampath Kumar started 48 hours deeksha on Tuesday evening.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్‌ల శాసనసభ్యత్వాన్ని రద్దు చేయడంపై కోర్టును ఆశ్రయించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది. మరో వైపు ఈ వ్యవహరంపై శాసనసభ్యత్వాన్ని రద్దు చేయడంపై 48 గంటల పాటు దీక్షకు దిగాలని కోమటిరెడ్డి, సంపత్ కుమార్ నిర్ణయం తీసుకొన్నారు.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ప్రసంగం సాగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెడ్‌ఫోన్ విసరడంతో శాసనమండలి ఛైర్మెన్ స్వామిగౌడ్ కంటికి గాయమైంది. శాసనమండలి చైర్మెన్ స్వామిగౌడ్‌ను గాయపర్చినందుకు గాను కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడింది.అంతేకాదు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్‌ల శాసనసభ్యత్వాలను రద్దు చేస్తూ మంగళవారం నాడు నిర్ణయం తీసుకొన్నారు.మార్చి 13న కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలు నిర్ణయం తీసుకొన్నారు.
నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సభ్యత్వాలను రద్దు చేయాలని తీసుకొన్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. ఈ పరిణామాలను నిరసిస్తూ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు 48 గంటల పాటు దీక్షకు దిగాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు ఈ రెండు నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు హైద్రాబాద్‌కు తరలివస్తున్నారు.
కాగా సాయంత్రం కోమటిరెడ్డి, సంపత్‌లు 48 గంటల తమ దీక్షను ప్రారంభించారు. దీక్ష నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. గాంధీ భవన్ ఎదుట కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసి, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే తాము దీక్ష ప్రారంభించామని కోమటిరెడ్డి, సంపత్ కుమార్‌లు వెల్లడించారు. ఇద్దరి శాసన సభ్యత్వాలు రద్దు చేయడం దారుణమని మండిపడ్డారు. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.