After MLA movie, Speculations on Kalyan Ram's political entry is become hot topic in TDP circles.
తెలుగునాట ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ అప్పట్లో ఓ సంచలనం. కేవలం నెలల వయసున్న పార్టీతో.. ఏళ్లుగా పాతుకుపోయిన కాంగ్రెస్ పార్టీని ఆయన ఓడించగలిగారు. కానీ ఆ తర్వాతి రోజుల్లో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలు ఆయన ప్రభను తగ్గిస్తూ వచ్చాయి. క్రమంగా పార్టీ సైతం చంద్రబాబు చేతుల్లోకి వెళ్లిపోయింది. తెలుగుదేశం భవిష్యత్తు వారసుడిగా అడపాదడపా జూ.ఎన్టీఆర్ వినిపిస్తూ వస్తున్నా.. ఇప్పట్లో ఆయన రాజకీయాల వైపు చూసే అవకాశం లేదు. కానీ జూ.ఎన్టీఆర్ అన్న కల్యాణ్ రామ్ మాత్రం ఆ దిశగా అడుగులు వేస్తున్నారా? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి.
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఎమ్మెల్యే' ఆయన పొలిటికల్ ఎంట్రీపై ఊహాగానాలకు తావిచ్చింది. 'నేనింకా రాజకీయం మొదలుపెట్టనే లేదు.. మొదలుపెడితే చేయడానికి మీకేమి మిగలదు' అంటూ ఆయన చెప్పిన డైలాగ్.. రాజకీయాలపై పరోక్షంగా ఆయన ఆసక్తిని తెలియజేసిందా? అన్న చర్చ జరుగుతోంది.
ఎమ్మెల్యే ఆడియో ఫంక్షన్ సందర్భంగా రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి సైతం కల్యాణ్ రామ్ రాజకీయాల్లోకి రావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. పైగా.. 'తెలుగుదేశం పార్టీ మీది.. రామారావు గారి కుటుంబం నుంచి నీలాంటి వాడు వస్తే ప్రజలు బాగుపడుతారు' అంటూ పోసాని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.
వైసీపీ పట్ల సానుభూతితో వ్యవహరించే పోసానికి ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ అంటే పూర్తిగా గిట్టదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు.. పార్టీని నారా వారి చేతుల్లో నుంచి నందమూరి కుటుంబం తిరిగి చేజిక్కించుకోవాలని పరోక్షంగా చెప్పినట్టయింది.
స్తుతం తెలుగుదేశం పరిస్థితి కూడా ఏమంత బాగా లేదనే చెప్పాలి. మరీ ముఖ్యంగా చంద్రబాబు తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసే నాయకుడెవరూ పార్టీలో కనిపించడం లేదు. లోకేష్ ఉన్నా.. ఆయన నాయకత్వంపై అంతగా నమ్మకం లేదు. కాబట్టి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ పగ్గాలు మళ్లీ నందమూరి కుటుంబం చేతుల్లోకి వెళ్లే అవకాశాలను కొట్టిపారేయలేం. ఈ క్రమంలో జూ.ఎన్టీఆర్ లేదా కల్యాణ్ రామ్ పార్టీ పగ్గాల కోసం ప్రయత్నించవచ్చునన్న వాదన వినిపిస్తోంది.