Varalakshmi Vratam Celebrations in AP : శ్రావణమాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా రాష్ట్రంలోని పలు అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలోని కోటదుర్గం ఆలయం భక్తులతో కిక్కిరిసింది. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ ఆవరణలో నిర్వహించిన కుంకుమ పూజల్లో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పాలంగిలోని కనకదుర్గమ్మ అమ్మవారిని గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు. విశిష్ట అలంకరంలో ఉన్న అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో తిరుపతమ్మ అమ్మవారి దేవాలయంలో నాలుగో శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మీ పూజలు వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం పూజలో పాల్గొనే మహిళలతో కిక్కిరిసింది. భక్తి శ్రద్ధలతో మహిళలు నిర్వహించిన అమ్మవారి వరలక్ష్మీ వ్రతానికి అవసరమైన పూజా సామాగ్రిని ఆలయ అధికారులు అందజేశారు. నందిగామ మండలం అంబారుపేట సత్యమ్మ తల్లిని శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని 50 వేల గాజులతో ముస్తాబు చేశారు.