Police Build Temporary Bridge For Tribal Village : పార్వతీపురం మన్యం జిల్లా ఉదయపురం పంచాయతీ కంటుగూడ గిరిజన గ్రామానికి వెళ్లాలంటే మధ్యలో ఉన్న గెడ్డ దాటాల్సిందే. గ్రామస్థులు, విద్యార్థులు పడుతున్న ఈ సమస్యపై ఇటీవల వచ్చిన కథనాలపై నీలకంఠాపురం పోలీసులు స్పందించారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న గెడ్డపై తాటిచెట్లు, కర్రలతో తాత్కాలికంగా వంతెనను ఏర్పాటు చేశారు. సీఐ హరి ఈ వంతెనను ప్రారంభించారు. ప్రజలకు రాకపోకల సమస్య ఉండకూడదనే ఉద్దేశంతో వంతెన నిర్మాణం చేసినట్లు ఎస్ఐ రమేష్ నాయుడు తెలిపారు. జిల్లా ఎస్పీ మాధవరెడ్డి సూచన మేరకు ఈ వంతెనను ఏర్పాటు చేశామన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గెడ్డలు దాటడం గిరిజనులకు, పాఠశాల విద్యార్థులకు కష్టంగా మారింది. రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో ఇబ్బంది పడుతున్న గిరిజనుల సమస్యను గుర్తించి ఈ వంతెనను సిద్ధం చేశారు. పోలీసులు చేసిన ఈ సేవా కార్యక్రమాన్ని స్థానికులు అభినందిస్తున్నారు.