Sircilla Gift for Dubai King : రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ తన అద్భుతమైన చేనేత కళా నైపుణ్యంతో మరో అరుదైన కళాఖండాన్ని రూపొందించారు. దుబాయ్‌లో నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకల సందర్భంగా ఆ దేశ రాజుకు అందించేందుకు ప్రత్యేకమైన కానుకను సిద్ధం చేశారు. చేనేత రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన హరిప్రసాద్‌కు, దుబాయ్ రాజు కోసం అరుదైన కానుకను తయారు చేయాలని ఆర్డర్ రావడంతో, తన సృజనాత్మకతను జోడించి ప్రత్యేక కళాఖండాన్ని రూపొందించారు. వెండి, పట్టుదారాలను ఉపయోగించి ముగ్గురు రాజుల ముఖచిత్రాలను చేనేత వస్త్రంపై అద్భుతంగా పొందుపరిచారు. రెండు మీటర్ల పొడవు కలిగిన ఈ కళాఖండంలో 26 గ్రాముల వెండిని వినియోగించారు. ప్రత్యేక డిజైన్‌ను రూపొందించేందుకు 15 రోజుల సమయం పట్టిందన్నారు. ఈనెల 11న ఎమిరేట్స్ తెలంగాణ కల్చర్ అసోసియేషన్ దుబాయ్‌లో బతుకమ్మ ఉత్సవాల్లో ఈటీసీఏ ప్రతినిధులు రాజుకు కానుకగా అందజేయనున్నారు.