Edupayala Vanadurga Bhavani : మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల్లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి 108 బోనాలను భక్తిశ్రద్ధలతో సమర్పించారు. డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాల మధ్య బోనాల కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు విద్యుత్ కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించి, వారి ఇబ్బందులను తొలగించాలని పద్మాదేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తుల కోసం ఆలయంలో తొమ్మిది రోజుల పాటు నిత్య అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. 19న సుహాసిని పూజ, చండీ హోమం నిర్వహించనున్నారు. బాల త్రిపుర సుందరి దేవి అలంకారంతో ప్రారంభమైన ఉత్సవాలు, 20న శ్రీరాజరాజేశ్వరి దేవి అలంకారంతో ముగుస్తాయని ఆలయ ఈవో వీరేశం తెలిపారు. శరన్నవరాత్రుల సందర్భంగా రోజుకో అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు.