తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయంలో వేద మంత్రోచ్ఛారణ నడుమ పుష్పయాగం అత్యంత వైభవోపేతంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామికి సువాసనలు వెదజల్లే 16 రకాల పుష్పాలు, ఆరు రకాల పత్రాలతో అర్చకులు పుష్పార్చన నిర్వహించారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం ఐదు గంటలకు వరకు సాగిన మహోత్సవంలో ఉత్సవ మూర్తులకు నూతన పట్టు వస్త్రాలను సమర్పించారు. చామంతి, సంపంగి, రోజా, గన్నేరు, మల్లెలు, కనకాంబరం, తామర, మాను సంపంగి, ఇతర పుష్పాలు, తులసి, మరువం, దవణం, బిల్వం, పన్నీరు, కదిరిపచ్చ పత్రాలతో స్వామి, అమ్మవార్లను అర్చించారు. ఈ సందర్భంగా వేదపండితులు రుగ్వేదం, శుక్లయజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, సామవేదం, అదర్వణ వేదాలను పఠించారు. పుష్పయాగం విజయవంతంగా ముగిసిన అనంతరం టీటీడీ అధికారులు ప్రత్యేక సన్మాన కార్యక్రమం చేపట్టారు. టీటీడీ ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులును టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి శాలువతో ఘనంగా సన్మానించారు.