Sing Baghel Visit SV Goshala : తిరుమల ఎస్వీ గోశాలను కేంద్ర సహాయ మంత్రి సింగ్ బఘేల్ నేతృత్వంలోని పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ సందర్శించింది. తిరుపతిలో నిర్వహించిన కన్సల్టేటివ్ కమిటీ సమావేశం అనంతరం ఆయన గోశాలను పరిశీలించారు. గోశాలలో ఏర్పాటు చేసిన విశాలమైన, శాస్త్రీయ పద్ధతిలో నిర్మించిన షెడ్లు, పశువుల సంరక్షణ, ఆరోగ్య పరిరక్షణ, నాణ్యమైన దాణా సరఫరా, నిర్వహణ విధానాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గోశాలలో ప్రధానంగా స్వదేశీ సాహివాల్ జాతి ఆవులను పెంచుతున్నట్లు తెలిపారు. వీటి నుంచి లభించే స్వచ్ఛమైన పాలు, పెరుగు తదితర పాడి ఉత్పత్తులను తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంతో పాటు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ అవసరాలకు వినియోగించడం విశేషమన్నారు. పూజలు, అభిషేకాలకు అవసరమైన పాడి ఉత్పత్తులను నాణ్యత, స్వచ్ఛతతో అందించేందుకు ఈ గోశాల ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. గతంలో తాము సందర్శించిన సాధారణ గోశాలలతో పోలిస్తే ఎస్వీ గోశాల ఆధునిక సౌకర్యాలతో, శాస్త్రీయ పద్ధతుల్లో రూపుదిద్దుకోవడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో ఎస్వీ గోశాల దేశానికే ఆదర్శవంతమైన గోశాలగా అభివృద్ధి చెందుతుందనే ఆశాభావాన్ని సింగ్ బఘేల్ వ్యక్తం చేశారు.