Alliance Candidate Campaigning with Drone : మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఎన్నికల ప్రచార తీరును మార్చేస్తుంది. ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. గతంలో ఎన్నికల ప్రచారం అంటే రిక్షాకు కట్టిన మైకులు, గోడ మీద రాతలు, గోడకు అంటించిన పత్రికలు మనకు గుర్తొస్తాయి. ప్రస్తుత పంచాయతీ ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు భిన్నమైన రీతిలో ప్రచారం చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం మండపాక గ్రామంలో కూటమి పార్టీలు బలపరిచిన అభ్యర్థిగా ఆత్మకూరి రామకృష్ణ సర్పంచ్‌గా పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రచారంలో వెరైటీ ఉండాలనుకున్నారో ఏమోగానీ ఇంటింటికి వెళ్లినప్పుడు తనకు కేటాయించిన బుట్ట గుర్తును వెంట తీసుకెళ్లి ప్రచారం చేస్తున్నారు. అంతే కాదు ప్రచారంలో ముందుండే ఆటో పైన అందరికీ కనిపించేలా ఏర్పాటు చేశారు. అక్కడితో ఆగలేదు పొలంలో ఎరువులు మందులు చల్లడానికి వాడే డ్రోన్‌కు బుట్టను కట్టి ఆ బుట్ట కింద తన ఫోటోతో ఉన్న బ్యానర్ను కట్టించి ఆకాశంలో ప్రచారం చేస్తున్నారు. నాయకులు కార్యకర్తలతో కలిసి వీధులు వెంట తిరుగుతూ ప్రచారం చేస్తుంటే పైన ఆకాశంలో వీరి వెనకాలే డ్రోన్ ఎగురుతూ ప్రచారం చేయడం చూసి గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.