Leopard Spotted on Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ సమీపంలో భక్తులకు అకస్మాత్తుగా చిరుత కనిపించింది. నడక మార్గంలోని 2765వ మెట్టు వద్ద ఉన్న ఓ చెట్టుపై చిరుతపులి దర్జాగా కూర్చుని ఉండటాన్ని గమనించారు. అటుగా వెళ్తున్న భక్తులు చెట్టుపై ఉన్న పులిని చూసి భయాందోళనలకు గురయ్యారు. ప్రాణభయంతో పరుగులు తీశారు. వెంటనే అక్కడే ఉన్న టీటీడీ భద్రతా సిబ్బందికి, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.భక్తుల సమాచారంతో అటవీ, విజిలెన్స్ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. హుటాహుటిన చిరుత కనిపించిన ప్రాంతానికి చేరుకున్నారు. అలిపిరి నడక మార్గంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం భక్తులను ఒంటరిగా కాకుండా గుంపులు గుంపులుగా కొండపైకి పంపుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలతో వచ్చే తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు అటవీ శాఖ సిబ్బంది చిరుత కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Comments