Bhimavaram Mavullamma Temple : పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. నవరాత్రుల్లో భాగంగా నాలుగో రోజైన బుధవారం అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. సకల వేదాలకు సారూప్యమైన ఈ అలంకారాన్ని చూసేందుకు ఉదయం నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తారు. వేలాది మంది భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. లోకంలోని ఆకలి తీర్చే కరుణామయి అన్నపూర్ణ దేవి అని భక్తుల నమ్మకం. భక్తిశ్రద్ధలతో కొలిచిన వారికి ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటుందని విశ్వాసం.అమ్మవారికి పూజలు చేస్తే అన్నపానీయాలకు ఎన్నటికీ కరవు రాదని, సమృద్ధిగా ప్రసాదిస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. కరుణామయి అయిన అన్నపూర్ణ దేవి దర్శనంతో తమకు ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని భక్తులు భావిస్తారు. దేవి కరుణతో తమకు ఐశ్వర్యం, సమస్త సుఖసంతోషాలు చేకూరుతాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగుతున్నాయి. పండుగ వాతావరణంలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరిస్తున్నారు.