Nellore Stonehousepet Temple : రాష్ట్రంలో దసరా శరనవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా వివిధ రూపాల్లో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం నుంచే భక్తులు ఆలయాలు, మండపాల వద్దకు చేరుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పెద్ద ఎత్తున నైవేద్యాలు సమర్పిస్తున్నారు. భవానీ నామస్మరణతో ఆలయాలు, మండపాలు మారుమోగుతున్నాయి. ఈ క్రమంలోనే నెల్లూరు స్టోన్ హౌస్ పేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా మూడో రోజున మంగళవారం నాడు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా దేవాలయాన్ని వినూత్నంగా దాదాపు నాలుగు టన్నుల మిఠాయిలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. మూలవర్లతోపాటూ ఉత్సవమూర్తిని, ఆలయ ప్రాంగణాన్ని స్వీట్లు, వివిధ రకాల తినుబండారాలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. అమ్మవారి దర్శనానికి వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఈ అలంకరణను ఆసక్తిగా తిలకించారు. వీటిని భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేయనున్నట్లు ఆలయ ఛైర్మన్ కోట గురుబ్రహ్మం తెలిపారు.