Hanumantha Vahana Seva : బ్రహ్మాండ నాయకుని కమనీయ ఉత్సవం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమల శ్రీవారు నేడు హనుమంత వాహనంపై మాఢవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. నిన్న గరుడవాహన సేవ అంగరంగ వైభవంగా సాగింది. కనీవినీ ఎరుగని రీతిలో కన్నుల పండువగా వైకుంఠనాథునికి సాగిన గరుడ వాహన సేవను తిలకించేందుకు భక్తజనం పోటెత్తింది. భక్తులకు ఇబ్బందులు లేకుండా టీటీడీ సకల సౌకర్యాలు కల్పించింది. విశేష ఆభరణాలతో స్వామివారు మాడవీధుల్లో ఊరేగారు. భక్తులు కర్పూర హారతులు ఇచ్చి శ్రీవారిని కొలిచారు. గరుడవాహన సేవను తిలకించేందుకు భక్తజనం భారీగా తరలివచ్చారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ ఏర్పాట్లు చేసింది. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల మధ్య స్వామివారి వాహనసేవ కోలాహలంగా సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు గజ వాహనసేవ నిర్వహించనున్నారు.