Rains in Alluri District : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం వల్ల అల్లూరి జిల్లాలో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు, పొంగి పొర్లుతున్నాయి. జిల్లాలో సరాసరి మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హుకుంపేట మండలం చీడిమెట్ట బ్రిడ్జి పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. జీకే వీధి మండలం జరెలలో మారుమూల వైద్య పరీక్షల కోసం వెళ్లిన 108 వాహనం బురదలో దిగబడింది. స్థానిక టీడీపీ నాయకుడు సత్తిబాబు జేసీబీ సాయంతో బయటకు తీశారు. గంగవరం కల్వర్టు కూడా కొట్టుకుపోయింది. పెదబయలు మండలం కిముడుపల్లి పంచాయతీ గేదిగడ్డ, సంపంగి పుట్టువాగు, గుల్లెలు పంచాయితీ కించూరు వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జి మాడుగుల మండలం అండంగిసింగి, బీరం వాగుల పైనుంచి నీరు ప్రవహిస్తోంది. అనంతగిరి మండలం ఘాట్ రోడ్డులో చెట్లు పడి రాకపోకలు అంతరాయం ఏర్పడింది. స్థానిక ఎస్సై సాయంతో లైన్ క్లియర్ చేశారు. ఇప్పటి వరకు వర్షాలు లేక వడలిపోతున్న ప్రత్తి, మిర్చి, కొబ్బరి, వరిపైర్లకు ఈ వర్షం ప్రాణం పోసిందని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.