ChatGPT Books Tirumala Room Via TTD Website : చాట్‌జీపీటీ తిరుమలలో రూమ్ బుక్ చేసింది. నిత్యం లక్షల మంది భక్తులు ఉపయోగించే టీటీడీ వెబ్సైట్ ద్వారా ఒక ఏఐ మోడల్ వసతి గదిని దాదాపు బుక్ చేసింది. టెక్ బై పవన్ అనే ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్లో సంబంధిత వీడియోను ఆ టెకీ పంచుకున్నాడు. ఆయన అత్యాధునిక ఏఐ ఏజెంట్ అయిన చాట్‌జీపీటీ-6 ఆస్ట్రాకు డిసెంబర్ 21న తిరుమలలో వసతి బుక్ చేయాలని ప్రాంప్ట్ ఇచ్చారు. యూజర్ లాగిన్ వివరాలు ఉపయోగించుకుని ఆ చాట్‌బాట్ టీటీడీ వెబ్సైట్లోకి సులువుగా ప్రవేశించింది. అందుబాటులో ఉన్న ఆప్షన్లను ఎంచుకుని, బుకింగ్ ప్రక్రియను చివరి వరకు తీసుకెళ్లింది. బ్యాంకు వివరాలు ఇవ్వకపోవడంతో పేమెంట్ దగ్గర నిలిచిపోయినట్లు ఆ టెకీ వీడియోలో పేర్కొన్నారు. ఈ అంశంపై టీటీడీ ఐటీ అధికారి స్పందిస్తూ దర్శన టికెట్ లేకుండా టీటీడీ వెబ్సైట్లో వసతి బుక్ చేయడం కుదరదని స్పష్టం చేశారు.