Pink Victory Run For Cancer Awareness : మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని చినజీయర్ స్వామీజీ పేర్కొన్నారు. మెడికవర్ హాస్పిటల్, ఫిక్కీ, రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నెక్లెస్ రోడ్డులో నిర్వహించిన పింక్ విక్టరీ రన్‌ను ఆయన ప్రారంభించారు. క్యాన్సర్‌ను ప్రాథమిక స్థాయిలోనే గుర్తిస్తే నివారించడం సాధ్యమని అన్నారు. అత్యాధునిక సాంకేతికత కలిగిన నేటి రోజుల్లో క్యాన్సర్ నివారణకు మెరుగైన చికిత్స అందించేందుకు అవకాశం ఉందని చెప్పారు. గ్రామీణ ప్రజలతో పాటు పట్టణ ప్రాంత ప్రజలకు క్యాన్సర్‌పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్లపై మహిళలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కార్యక్రమం నిర్వాహకురాలు, వైద్యురాలు డాక్టర్ గీత నాగశ్రీ, ఔత్సాహికులు తదితరులు పాల్గొన్నారు.క్యాన్సర్ చాలా భయంకరమైన వ్యాధి. శరీరంలో ముదిరిన తర్వాతే బయటకు తెలుస్తుంది. ఈ వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. మహిళల్లో రొమ్ము, సర్వైకల్ క్యాన్సర్లపై ముందస్తు అవగాహన కల్పించడం కోసం పింక్ విక్టరీ రన్ చేస్తున్నాం. మహిళలు అనారోగ్యంగా ఉంటే వారి కుటుంబం, సమాజానికి నష్టం. వారి ఆరోగ్యం సమాజంలోని వారందరి బాధ్యత. - చినజీయర్ స్వామీజీ