Actress Tamanna Visits Tirumala : తిరుమల శ్రీవారి సేవలో నటి తమన్నభాటియా పాల్గొన్నారు. బుధవారం వేకువజామున ఆమె కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొన్నారు. వేకువజామున జరిగిన స్వామివారి సుప్రభాత సేవ, అలాగే అర్చన సేవల్లో ఆమె పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న తమన్నా గర్భగుడిలో శ్రీవారి మూలవిరాట్టును దర్శించుకుని మ్రొక్కులను చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు తమన్నాకు వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను ఆమెకు అందజేశారు. శ్రీవారి దర్శనం అనంతరం తమన్నా మీడియాతో మాట్లాడారు. తిరుమల క్షేత్రానికి రావడం ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుందని, స్వామివారిని దర్శించుకోవడం వల్ల మనసుకు తృప్తి, ఆనందం, ప్రశాంతత లభిస్తాయని అన్నారు. తమన్నా రాకతో ఆలయ ప్రాంగణంలో అభిమానులు ఆమెను చూసేందుకు ఆసక్తి కనబరిచారు. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక ప్రవేశ దర్శనాల టికెట్ల కోటా నేడు విడుదల చేశారు. ఈనెల 12, 13, 14, 19, 20 తేదీల్లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు జారీ చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఈనెల 11 నుంచి 20 వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు.