Dussehra Navratri Celebrations at Peddamma Thalli Temple : హైదరాబాద్లోని ప్రసిద్ధ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బుధవారం అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజాము నుంచే ఆలయంలో వేద పండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు, ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు నిర్వహించారు. అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. రాత్రివేళ విద్యుత్ దీపాల కాంతులతో పెద్దమ్మ తల్లి ఆలయం సర్వాంగసుందరంగా ముస్తాబై పండుగ శోభను సంతరించుకుంది. పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగణమంతా భక్తుల సందడితో కోలాహలంగా మారింది. పెద్దసంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి అలంకరణను తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరిస్తూ, సెల్ఫీలు దిగుతూ ఆనందం వ్యక్తం చేశారు. పెద్దమ్మ తల్లి ఆలయం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. నవరాత్రులలో శుక్ర, శని, ఆదివారాల్లో, దుర్గాష్టమి, మహర్నవమి రోజుల్లో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది.