Tiger Spotted in Jeelugumilli : ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. గత మూడు రోజులుగా కామయ్యపాలెం బీట్ పరిధిలోని జిల్లెల్లగూడెం, బొత్తప్పగూడెం పరిసర ప్రాంతాల్లో సంచరిస్తోంది. ఇప్పటికే ఓ ఎద్దును హతమార్చింది. ఈ నేపథ్యంలో గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని, పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అటవీశాఖ అధికారులు రెండు రోజులుగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.ఈ క్రమంలో తాజాగా ఇవాళ తెల్లవారుజామున పెద్దపులి హఠాత్తుగా జీలుగుమిల్లి గ్రామంలోని పాలచర్ల వెళ్లే రహదారిపై ప్రత్యక్షమైంది. కారుకు ఎదురుగా రావడంతో లైట్ వెలుతురుకు భయపడిన బెబ్బులి పరుగులు తీసింది. ఆ దృశ్యాలు పక్కనే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పాలచర్ల రోడ్డు వెంట పొలాల్లోకి పెద్దపులి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఈ క్రమంలోనే అధికారులు గ్రామస్థులను అప్రమత్తం చేశారు. ఎవరూ ఒంటరిగా బయటకు రావొద్దని సూచించారు. పులి జాడ తెలిస్తే తమకు వెంటనే సమాచారం అందించాలని పేర్కొన్నారు.