వికారాబాద్ జిల్లా పరిగి మండలం లఖ్నాపూర్ సమీపంలోని పంట పొలాల్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పక్క పొలం నుంచి ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలు క్షణాల్లోనే పంట పొలాలకు వ్యాపించింది. సుమారు 15 ఎకరాల్లో మొక్కజొన్న, కంది పంటలు అగ్నికి ఆహుతైంది. అంజిలయ్య అనే రైతుకు చెందిన 5 ఎకరాల మొక్కజొన్న, 5 ఎకరాల కంది పంట పూర్తిగా దగ్ధమైంది. నూర్పిడి చేసి కుప్పగా ఉంచిన మొక్కజొన్నతో పాటు చేతికి వచ్చిన కందిపంట కూడా బూడిదైంది. దాదాపు రూ.10 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. భేరి నాగరాజు అనే రైతుకు చెందిన 2 ఎకరాల కందిపంట దగ్ధమైంది. ఈ పంట విలువ రూ.2 లక్షల ఉంటుందని అంచనా. యాదయ్య అనే రైతుకు చెందిన మొక్కజొన్న కుప్ప కూడా అగ్నికి ఆహుతైంది.ఫైర్ ఇంజన్ చేరుకునేలోపే లక్షల రూపాయల పంట అగ్నికి ఆహుతైందని, అప్పులు చేసి పంట సాగు చేస్తే చివరకు కళ్ల ముందే బూడిదైందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి బాధితులు విజ్ఞప్తి చేశారు. పంట నష్టంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన అంజిలయ్య భార్య తమకు ఆత్మహత్యే శరణ్యమని కన్నీరుమున్నీరయ్యారు.