Unseasonal Rains In Krishna District : ఒకవైపు వరుస తుపాన్లు మరోవైపు అకాల వర్షాలు అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కృష్ణా జిల్లా మొవ్వ మండలం అయ్యంకిలో అకాల వర్షానికి ధాన్యం తడిసింది. వెంటనే ధాన్యాన్ని కొనాలని రైతులు అధికారులను వేడుకుంటున్నారు. నిబంధనలు సడలించి రైతులను ఆదుకోవాలని మొవ్వ జడ్పీటీసీ నన్నపనేని వీరేంద్ర కోరారు. అల్పపీడన ద్రోణివల్ల ఈరోజు ఉదయం వర్షం కురిసింది. యంత్రాలతో కోసిన ధాన్యంలో తేమశాతం ఉన్నందు వల్ల నిబంధనలు సడలించి ఇతర జిల్లాలకు తరలింపునకు అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చి రైతులను ఆదుకోవాలని కోరారు.పంటకోసి నాలుగు రోజులు అయ్యిందనీ, అకాల వర్షాలకు ధాన్యం అంతా తడిసిపోయిందనీ రైతులు వాపోయారు. ధాన్యాన్ని పండించిన వారిలో అధికంగా కౌలు రైతులే ఉన్నారు. ఇంకా నాలుగు రోజులు వర్షాలు ఉన్నాయనీ, ధాన్యాన్ని కొనుగోలు చేయవలసిందిగా రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తహసీల్దార్, కలెక్టర్ వెంటనే స్పందించి ధాన్యాన్ని మిల్లులకు తరలించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.