మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో బుధవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. ఒక్కసారిగా కురిసిన వర్షపు ఉద్ధృతికి కోనాపూర్ బండపై ఆరబోసిన ధాన్యం నీటిలో కొట్టుకుపోయి నేలపాలైంది. సుమారు 20 మంది రైతులకు చెందిన ధాన్యం వరద నీటిలో కొట్టుకుపోయింది. తమ కళ్ల ముందే కష్టార్జితం నీటి పాలవుతుండటాన్ని చూసి రైతులు బోరున విలపించారు. పంట కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో? కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియడం లేదంటూ ఆవేదన చెందుతున్నారు. అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి కొట్టుకుపోయిన ధాన్యాన్ని అంచనా వేయాలని, జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ స్పందించి బాధిత రైతులకు తక్షణమే పరిహారం అందించాలని రైతులు వేడుకుంటున్నారు. 2 ఎకరాల పొలం కౌలుకు తీసుకొని పంట పండించాను. 2 ట్రాక్టర్ల దిగుబడి వచ్చింది. వడ్లను తీసుకొచ్చి బండపైన ఆరబెట్టాం. అకాల వర్షానికి ధాన్యం పూర్తిగా కొట్టుకుపోయింది. 2 ట్రాక్టర్లకు సగం ట్రాక్టర్ వడ్లు మాత్రమే మిగిలాయి. ధాన్యాన్ని ఆరబోసి అమ్ముకునేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఈ అకాల వర్షం కురిసింది. తినడానికి కూడా ఏమీ మిగల్లేవు. - రైతు
Comments