Attack On MLA Bhuma Akhila Priya Vehicle in Ahobilam : పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా నంద్యాల జిల్లా అహోబిలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వాహనంపై వైఎస్సార్సీపీ మద్దతుదారులు దాడి చేశారు. దీంతో వాహనం అద్దాలు పగిలిపోయాయి. పంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళి పరిశీలించేందుకు ఎమ్మెల్యే అఖిలప్రియ అహోబిలం వెళ్లారు. ఓ పోలింగ్ కేంద్రంలోకి ఎమ్మెల్యే వెళ్తుండగా వైఎస్సార్సీపీ వర్గీయులు, ఆ పార్టీ ఏజెంట్లు అడ్డుకున్నారు.ఎమ్మెల్యే కారు అద్దాలు ధ్వంసం : ఈ క్రమంలో టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రెండు వర్గాలు రెచ్చగొట్టే రీతిలో వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య రాళ్లదాడి జరిగింది. రెండువర్గాలు రాళ్లు, కర్రలతో దాడులకు దిగారు. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ దాడిలో ఎమ్మెల్యే కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఎమ్మెల్యే కారు డ్రైవర్‌తో పాటు పలువురికి స్పల్పంగా గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు పెద్ద సంఖ్యలో అహోబిలం చేరుకున్నారు. ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ తీవ్రంగా మండిపడ్డారు. ముందస్తు కుట్రలో భాగంగానే దాడి జరిగిందని పేర్కొన్నారు. పోలీసుల సమక్షంలోనే తమపై దాడి జరిగిందని వివరించారు. ఎస్పీ సమక్షంలోనే వైఎస్సార్సీపీ దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు.