జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ ప్రైవేట్ స్కూల్లో పెట్టుకోవాల్సిన దుస్థితి రావడం అత్యంత బాధాకరమని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని ప్రభుత్వ పాఠశాలలో జరిపే స్తోమత కూడా ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్లో హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్లో సైన్స్ ఫెయిర్ జరపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్ వేదికగా 12 ఏళ్లు అద్భుతంగా సైన్స్ ఫెయిర్ నిర్వహించుకున్నామని గుర్తు చేశారు. కనీసం స్థానిక ఎమ్మెల్యేకు ఆహ్వానం పంపాలన్న కనీస మర్యాద, ప్రోటోకాల్ కూడా అధికారులు పాటించలేదన్నారు. రోడ్డు మీద వెళ్తూ ఫ్లెక్సీలను చూసి కార్యక్రమానికి రావాల్సి వచ్చిందని మండిపడ్డారు. బ్రేక్ ఫాస్ట్ పథకం సిద్దిపేటలో అమలు చేయడం లేదన్నారు. సగం అకాడమీ పూర్తి అయినా నేటికీ ఒక జత బట్టలు మాత్రమే విద్యార్థులకు అందాయని అన్నారు. పెండింగ్లో ఉన్న దుస్తులు పంపిణీ చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేసారు.