Huge Python Spotted At Mandamarri : మంచిర్యాల జిల్లా మందమర్రి సీఐఎస్ఎఫ్ కాలనీ వద్ద శనివారం రాత్రి భారీ కొండచిలువ సంచారం కలకలం రేపింది. కాలనీవాసులు బతుకమ్మ ఆడుతున్న స్థలానికి కొంతదూరంలో కొండచిలువ కనిపించింది. దీంతో స్థానికులు సింగరేణి స్నేక్ సొసైటీ సభ్యుడు పుల్లగొర్ల శ్రీనివాస్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన వెంటనే అక్కడికి చేరుకుని కొండచిలువను సురక్షితంగా పట్టుకున్నారు. ఈ కొండచిలువ 12 అడుగుల పొడవు, 20 కిలోలు ఉన్నట్లు తెలిపారు. అటవీశాఖ అధికారుల సూచనతో సర్పాన్ని అటవీప్రాంతంలో వదిలేశారు. పది రోజుల వ్యవధిలోనే రెండుసార్లు కొండచిలువ ఈ ప్రాంతంలో కనిపించడంతో కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఏడాది జులైలో మందమర్రిలో కొండచిలువ జనావాసాల్లోకి వచ్చింది. మందమర్రి రెండో జోన్ గ్యాస్ గోదాం ముందు ఉన్న దుకాణం సమీపంలోని రమేశ్ అనే వ్యక్తి ఇంటి ఆవరణలో కనిపించింది. ఆ కొండచిలువ కూడా సుమారు 12 అడుగుల పొడవు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.