President Droupadi Murmu : విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము విచ్చేస్తున్న తరుణంలో ఆమెకు స్వాగతం పలుకుతూ తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో ప్రముఖ సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ తన కుమార్తెలు దేవిన సోహిత, దేవిన ధన్యతలతో కలిసి అద్భుతమైన సైకత శిల్పాన్ని రూపొందించారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము కనకదుర్గమ్మకు భక్తిశ్రద్ధలతో నమస్కరిస్తున్న భంగిమలో ఇసుక శిల్పాన్ని తీర్చిదిద్దారు. దుర్గమ్మ రూపాన్ని సుమారు 20 రకాల వివిధ పండ్లు, కూరగాయలతో సుందరంగా అలంకరించారు.రాష్ట్రపతి నేడు ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను దర్శించుకోనున్న దృష్ట్యా భక్తుల దర్శన వేళల్లో స్వల్ప మార్పులు చేసినట్లు దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ తెలిపారు. షెడ్యూల్ ప్రకారం రాష్ట్రపతి సాయంత్రం 7 గంటల తర్వాత ఆలయానికి చేరుకుంటారని, 8 గంటల్లోగా దర్శనం పూర్తి చేసుకుని తిరుగు పయనమవుతారని వెల్లడించారు. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా సుమారు అరగంట పాటు సర్వదర్శనాలకు అంతరాయం కలగనుందని కమిషనర్ వివరించారు.