భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో మురసు తుఫాన్ ప్రభావంతో భారీ వరదలకు గండిపడిన చారిత్రాత్మక అంకమ్మ చెరువును రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పరిశీలించారు. కేవలం 6 గంటల్లోనే దాదాపు 30 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదవడంతో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరదలకు పలు చెరువులు, రహదారులు దెబ్బతిన్నాయని మంత్రి అన్నారు. అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో దెబ్బతిన్న చెరువులు, రోడ్లకు పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టేందుకు వెంటనే అంచనాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.పెద్ద వాగు ప్రాజెక్టు రింగ్‌బండ్ మరమ్మతులపై ప్రభుత్వంతో మరోసారి చర్చిస్తానని, చెరువుల పునరుద్ధరణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రితో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. నష్టంపై ప్రభుత్వానికి నివేదిక అందించి బాధితులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. భవిష్యత్తులో ఎలాంటి విపత్తులనైనా తట్టుకునేలా చెరువులు, రహదారులను పటిష్ఠం చేస్తామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.
Comments