• 6 minutes ago
పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ఘాట్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక కంటైనర్ ట్రక్కు మలుపు వద్ద అదుపు తప్పి కొండను ఢీకొట్టింది. అదే సమయంలో బ్రేకులు ఫెయిల్ అయిన మరో లారీ అక్కడికి దూసుకురావడంతో పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. అప్పటికే అక్కడ సహాయక చర్యలు జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వరుస ప్రమాదాల్లో కంటైనర్ ట్రక్కు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.నుజ్జునుజ్జు అయిన కంటైనర్ క్యాబిన్: పి.కోనవలసలోని దుర్గా ఆలయం సమీపంలో 'ముస్కాన్ లాజిస్టిక్ సర్వీసెస్'కు చెందిన కంటైనర్ వేగంగా వెళ్తుండగా అదుపు తప్పి పక్కనే ఉన్న కొండను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కంటైనర్ క్యాబిన్ పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రహదారికి అడ్డంగా ఉన్న కంటైనర్‌ను తొలగించేందుకు క్రేన్‌ను రప్పించారు. ముందు జాగ్రత్త చర్యగా జగదల్‌పూర్ (ఒడిశా) నుండి విశాఖపట్నం వైపు వస్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సును పోలీసులు ఆపి ఉంచారు.ఊహించని విధంగా మరో ప్రమాదం: క్రేన్ సహాయంతో కంటైనర్‌ను తొలగిస్తున్న తరుణంలో ఊహించని విధంగా మరో ప్రమాదం జరిగింది. వెనక నుండి వేగంగా వచ్చిన ఒక లారీకి బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. ఆ లారీ ముందుకు దూసుకువచ్చి అప్పటికే ప్రమాదానికి గురై కంటైనర్ ట్రక్కు, ఆర్టీసీ బస్సు, క్రేన్‌ను వరుసగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వారిలో శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పోలేరు గ్రామానికి చెందిన లింగం శివ మరొక వ్యక్తి ఉన్నారు. పోలీసులు వెంటనే క్షతగాత్రులను అంబులెన్స్ ద్వారా సాలూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Category

🗞
News

Recommended