Indrakeeladri Giri Pradakshina : కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ఘనంగా జరిగింది. దుర్గా మల్లేశ్వరులు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యస్వామి, ఆంజనేయస్వామి తదితరులు కొలువైన ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వలన తమ కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. పౌర్ణమి రోజున ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ శ్రేష్టమని పండితుల మాట. ఉదయం ఘాట్ రోడ్డు ప్రవేశంలోని కామధేను అమ్మవారి సన్నిధి నుంచి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ వైభవంగా ప్రారంభంకాగా స్థానాచార్యులు విష్ణుభొట్ల శివ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ధర్మ ప్రచారం నిమిత్తం దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంప్రదాయకోలాట నృత్యప్రదర్శనలు, భజన సంకీర్తనా గానం వంటి కళా బృందాల కళా ప్రదర్శనలు, మంగళవాయిద్యాలు, వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ గిరి ప్రదక్షిణ ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. కార్తికమాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో పుణ్యస్నానాలు, దీపారాధన, దానధర్మాలు, భగవన్నామస్మరణకు విశేష ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా కార్తిక పౌర్ణమి రోజున దీపాలు వెలిగించడం అత్యంత పుణ్యప్రదమని పురాణాలు పేర్కొంటున్నాయి.