Minister Ponnam Prabhakar Travelling in RTC Bus husnabad : రాఖీ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించి సందడి చేశారు. హైదరాబాద్ నుంచి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు కాన్వాయ్‌లో వెళ్తున్న ఆయన ఈ క్రమంలో పందిళ్ల వద్ద ఆర్టీసీ బస్సు ఎక్కారు. మహిళలను ఆప్యాయంగా పలకరిస్తూ వారితో రాఖీలు కట్టించుకున్నారు. అలాగే హుస్నాబాద్ బస్టాండ్ వరకు బస్సులోనే ప్రయాణం కొనసాగించారు. బస్సులో మహిళ ప్రయాణికులతో ఆత్మీయంగా మాట్లాడారు. తమ సోదరీమణులతో హైదరాబాద్‌లో ముందు రాఖీలు కట్టించుకుని, తన నియోజకవర్గం హుస్నాబాద్‌లోని ప్రజలతో రాఖీ కట్టించుకునేందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మహిళ ప్రయాణికులు మంత్రికి పెద్ద ఎత్తున రాఖీ కట్టారు. అనంతరం హుస్నాబాద్ బస్టాండ్‌లో దిగిన మంత్రి మహిళా ప్రయాణికులతో ముచ్చటించి రాఖీ సందర్భంగా ఆర్టీసీ బస్సు సౌకర్యాలు, ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు. బస్టాండ్‌లోనూ పలువురు మహిళలు మంత్రికి రాఖీ కట్టారు. పండుగ పూట విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లను మంత్రి అభినందించి వారితో కరచాలనం చేశారు.
Comments