Python Rescue in Mangalagiri : గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో భారీ వర్షం కారణంగా స్థానిక ఇందిరా నగర్ ప్రాంతంలోని ఓ నివాసంలోకి భారీ కొండచిలువ ప్రవేశించింది. ఇంట్లోకి అకస్మాత్తుగా కొండచిలువ రావడంతో ఆ కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అనంతరం వారు వెంటనే అటవీశాఖ అధికారులకు, స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే అటవీ సిబ్బంది, రెస్క్యూ బృందం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంట్లో ఉన్న కొండచిలువను ఎంతో చాకచక్యంగా బంధించారు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఆ కొండచిలువను బ్రహ్మానందపురం సమీపంలోని కొండ ప్రాంతానికి తరలించి క్షేమంగా విడిచిపెట్టారు.మంగళగిరిలో భారీ వర్షాలు కురిసిన ప్రతిసారీ కొండపై నుంచి కొండచిలువలు కిందకు రావడం సర్వసాధారణంగా మారింది. వర్షపు నీటి ప్రవాహానికి కొట్టుకువస్తూ అవి సమీప జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొండ దిగువ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రాత్రి వేళల్లో తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు.