Nagole Ganesh Immersion : హైదరాబాద్‌లోని నాగోల్‌లో 72 అడుగుల భారీ మట్టి గణనాథుడి నిమజ్జనం పూర్తైంది. తిరంగా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి గణనాథుడిని పర్యావరణ హితంగా శనివారం రాత్రి నిమజ్జనం చేశారు. కాలుష్య నివారణే ధ్యేయంగా ఏర్పాటు చేసిన ఈ వినాయకుడిని ఏ చెరువులోనూ వేయకుండా, మండపం ప్రాంగణంలోనే నిమజ్జనం చేశారు. నిమజ్జన కార్యక్రమానికి మున్సిపల్ అధికారులు ముందస్తుగా ఏర్పాట్లు చేశారు.భారీ విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు క్రేన్లు, లైటింగ్ తదితర సౌకర్యాలను కల్పించారు. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సాయంతో ఉన్నచోటే నిమజ్జనం పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అందుబాటులో ఉండి భద్రతా చర్యలు చేపట్టారు. భారీ మట్టి గణనాథుడి నిమజ్జనాన్ని వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో నాగోల్ ప్రాంతంలో భక్తులతో సందడి వాతావరణం నెలకొంది.భక్తులకు మట్టి పంపిణీనాగోల్ శ్రీ అష్ట సిద్ధి మహా గణపతిని పశ్చిమ బెంగాల్‌కు చెందిన 21 మంది నిపుణులైన కళాకారులు నెల రోజుల పాటు శ్రమించి తీర్చిదిద్దారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ ఐరన్ మెటల్ ఉపయోగించకుండా కేవలం మట్టితోనే ఈ భారీ గణపతిని రూపొందించారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి విగ్రహాలను పూజించాలనే సందేశాన్ని అందించటమే ధ్యేయంగా శ్రీ అష్ట సిద్ధి మహా గణపతిని తయారు చేసినట్లు నిర్వాహకులు చెప్పారు. నిమజ్జనం తర్వాత ఆ మట్టిని భక్తులకు తిరిగి పంపిణీ చేసుకునేలా ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు.
Comments