Punugu Pilli Spotted in Mangalagiri : గుంటూరు జిల్లా మంగళగిరిలో అంతరించిపోతున్న జాతుల్లో ఒకటైన పునుగుపిల్లి ప్రత్యక్షమైంది. పానకాల లక్ష్మీనరసింహస్వామి కొండపై ఓ గుహలో ఇది కనిపించింది. ఉదయం వాకింగ్‌కి వెళ్తున్న కొంతమంది దీనిని చూశారు. ఆ తర్వాత దీన్ని వీడియో తీసి అటవీశాఖ అధికారులకు పంపించారు. కృష్ణా పరివాహక ప్రాంతాలలో పునుగు పిల్లులు సంచారం పెరిగిందని అధికారులు తెలిపారు. మంగళగిరి కొండపైన పచ్చదనం పెరగడం, అక్కడక్కడ నీటి కుంటలు ఉండటంతో తరచూ ఇక్కడికి వస్తున్నాయని చెప్పారు. ఇవి ఎక్కువగా రాత్రి సమయాల్లో వేటాడతాయని వివరించారు. మరోవైపు శేషాచలం, నల్లమల అడవుల్లో అరుదుగా కనిపించే ఈ జాతి పునుగుపిల్లులకు ఎన్నో విశిష్టతలు ఉన్నాయని నమ్ముతారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి ప్రతి శుక్రవారం అభిషేకం తర్వాత కాస్తంత పునుగు తైలాన్ని విగ్రహానికి పులుముతారు. "అత్తారు పన్నీరు పునుగు జవాదీ తోడ ముడుపు తెస్తున్నారు మేలుకో" అని అన్నమాచార్య తన కీర్తనలో వివరించడం పునుగుపిల్లి ప్రాశస్త్యాన్ని తెలియజేస్తుంది. పునుగుపిల్లి తైలం తీసే విధానంలోనూ ప్రత్యేకత ఉంది. ముందుగా ఇనుప జల్లెడలోని గదిలో దీనిని ఉంచుతారు. ఇనుప జల్లెడ గది పైభాగంలో రంధ్రం ఏర్పాటు చేస్తారు. రంధ్రం ద్వారా చందనపు కర్రను గదిలోకి నిలబెడతారు. 2 సంవత్సరాల తర్వాత పునుగుపిల్లి ప్రతి 10 రోజులకు ఒకసారి రకరకాల హావభావాలు ప్రదర్శిస్తూ చందనపు కర్రకు చర్మాన్ని రుద్దుతుంది. ఆ సమయంలో పునుగుపిల్లి చర్మం ద్వారా వెలువడే పదార్థమే పునుగు తైలం. ఈ తైలాన్ని సుగంధ పరిమళాలతో చూర్ణం చేసి మూలవర్లకు చేసే అభిషేకంలో ఉపయోగిస్తారు. ఇలా చేయడం వల్ల స్వామివారు శాంతిస్తారని విశ్వాసం.
Comments