Railway Kodur Theft : తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంటి యజమానులు ఊరికి వెళ్లడాన్ని అదునుగా చేసుకున్న దుండగులు తాళం వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డారు. పల్సర్ బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ముందుగా రెక్కీ నిర్వహించి, అనంతరం ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. రెండు ఇళ్లలో లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను అపహరించినట్లు బాధితులు చెబుతున్నారు. ఈ దొంగతనాలకు సంబంధించిన కీలక దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. రైల్వే కోడూరు మండల కేంద్రంలోని వైఎస్సార్ ఆఫీస్ సమీపంలో ఉన్న సీతారాం నగర్లో ఈ చోరీ ఘటనలు చోటుచేసుకున్నాయి.సీతారాం నగర్‌కు చెందిన భూమిరెడ్డి శివకుమార్ కుటుంబంతో కలిసి శుభకార్యం నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన ఇద్దరు గుర్తుతెలియని దుండగులు అర్ధరాత్రి దాటిన తర్వాత పల్సర్ బైక్‌పై అక్కడికి చేరుకున్నారు. ముందుగా ఇంటి పరిసరాల్లో రెక్కీ నిర్వహించి, ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత ప్రధాన ద్వారం తలుపులు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. అంతటితో ఆగకుండా పక్క వీధిలోని మరో ఇంటిని కూడా లక్ష్యంగా చేసుకుని దొంగతనానికి పాల్పడ్డారు. ఇలా రెండు ఇళ్లలో ఎవరూ లేని సమయంలో చొరబడిన దుండగులు లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను అపహరించినట్లు బాధిత కుటుంబాలు వెల్లడించాయి. దుండగులు బైక్‌పై రావడం, ఇంటి పరిసరాల్లో రెక్కీ నిర్వహించడం, తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లడం వంటి కీలక దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ దృశ్యాల ఆధారంగా నిందితులు ఎక్కడి నుంచి వచ్చారు? వారి కదలికలు ఎలా ఉన్నాయి? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.