Locals Save Two Children : శ్రీకాకుళం జిల్లాలో వరద నీటిలో కొట్టుకుపోతున్న ఆ పసివాళ్లను యువకులు ప్రాణాలకు తెగించి కాపాడారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నీటిలోకి దూకి పిల్లలను రక్షించిన ఆ యువకుల ధైర్యాన్ని చూసి గ్రామస్థులు ప్రశంసిస్తున్నారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం తీర ప్రాంతమైన డొంకూరు గ్రామంలో వరద నీరు పోటెత్తింది. పలుచోట్ల ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు ఆ వరద నీటిలో పడిపోయారు. ప్రవాహం ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో పిల్లలిద్దరూ అందులో కొట్టుకుపోసాగారు. ఇది గమనించిన చుట్టుపక్కల వారు భయంతో గట్టిగా కేకలు వేశారు.అదే సమయంలో అటుగా ఉన్న గ్రామానికి చెందిన డీలర్ బుడ్డ లోకేశ్, జానకిరామ్ ఆ కేకలు విన్నారు. వరద నీటిలో కొట్టుకుపోతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ చిన్నారులను వెంటనే గుర్తించారు. ఏమాత్రం ఆలోచించకుండా, తమ ప్రాణాలను పణంగా పెట్టి ఆ ఉద్ధృతమైన వరద నీటిలోకి దూకారు. ప్రవాహాన్ని ఎదిరిస్తూ అతి కష్టం మీద ఆ ఇద్దరు చిన్నారులను పట్టుకుని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.