Colorful Rainbow Sitarama Project Pump House : ఓ వైపు పంపు హౌస్ నుంచి ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న గోదావరి జలాల పరవళ్లు, మరోవైపు ఆ జలాలు ప్రవహించే కాలువలోకి పడే నీటి తుంపరలతో ఏర్పడిన రంగుల హరివిల్లు. అక్కడకు వచ్చిన పర్యాటకులను సంభ్రమాచార్యంలో ముంచెత్తింది. నింగి నుంచి నేలకు నిచ్చెన వేసినట్లుగా ఉన్న ఆ ఇంద్రధనస్సును సెల్ఫోన్లో బంధిస్తూ జనం కేరింతలు కొట్టారు. సెల్ఫీలు దిగారు. పంప్‌హౌస్‌ల వద్ద నీటి ప్రవాహాలు, అక్కడి ప్రకృతి దృశ్యాలు, హరివిల్లు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలోని సీతారామ ప్రాజెక్టు పంపుహౌస్ వద్ద ఆదివారం ఈ చిత్రం అబ్బురపరిచింది. గాలిలోని నీటి బిందువుల గుండా సూర్యకాంతి ప్రయాణించినప్పుడు కాంతి వక్రీభవనంతో పాటు పరావర్తనం చెందడం వల్ల ఆకాశంలో ఏడు రంగుల విల్లు ఆవిష్కృతమైంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లోని లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతోంది.