Water Falls In Palakondalu : ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా, పుట్టంపల్లి సమీపంలో ఉన్న పాలకొండ జలపాతం ఒక ప్రసిద్ధ, రమణీయమైన పర్యాటక ఆకర్షణ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల కడపలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల పాలకొండ జలపాతం జీవం పోసుకుని, కనువిందు చేస్తోంది. కొండల మీదుగా జాలువారే ఈ జలపాతాన్ని వీక్షించడానికి నగరవాసులు, పర్యాటకులు పోటెత్తుతున్నారు. సందర్శకులు పచ్చని పకృతిని, ఉత్సాహభరితమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ, జలపాతంలో స్నానం చేస్తూ ఆనందాన్ని పొందుతున్నారు. చాలా కాలం తర్వాత జలపాతం ఈ విధంగా మళ్లీ కనువిందు చేస్తుండడంతో అనేక మంది పర్యాటకులు తరలి వస్తున్నారు. గతంలో ఎల్ నినో ప్రభావం వల్ల ఏర్పడిన అధిక ఉష్ణోగ్రతలతో నగరవాసులు ఇబ్బంది పడ్డారు, కానీ ఇటీవల కురిసిన వర్షాలు ఈ జలపాతాన్ని కనువిందుగా మార్చాయి. దీనికి సంబంధించిన ఫొటోలు , వీడుయోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.