Vasavi Temple Vempalle : కడప జిల్లా వేంపల్లెలోని 122 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో మహిళలు ధనలక్ష్మీ పూజ, శ్రీ లలితా సహస్రనామ పారాయణం, కుంకుమ పూజ, నాణెములతో శ్రీ లక్ష్మీ అష్టోత్తర పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పర్వదినం సందర్భంగా వాసవి మాత అమ్మవారిని నగదు, బంగారు, వెండి ఆభరణాలతో కలిపి మొత్తం కోటి 71 లక్షల రూపాయల విలువైన సంపదతో శ్రీ ధనలక్ష్మీ దేవిగా అత్యంత వైభవంగా అలంకరించారు. అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనానికి అవకాశం కల్పించారు. ఆలయ అర్చకులు ఇంద్రకంటి ప్రసాద్ శర్మ నేతృత్వంలో అమ్మవారికి పంచామృతాభిషేకం, కుంకుమార్చన, నివేదన, నక్షత్ర హారతి, మహా మంగళహారతి, మంత్రపుష్పం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు భక్తి గీతాలు ఆలపిస్తూ అమ్మవారికి హారతులు సమర్పించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం, మహిళా మండలి, యువజన సంఘం ప్రతినిధులు, ఆలయ నిర్వాహకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.