Tirumala Brahmotsavam 2026 : కలియుగాధిపతిగా శేషాచల నివాసిగా ఏడుకొండల వెంకన్నగా పూజలందుకుంటున్న తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే రెండో రోజైన ఇవాళ ఉదయం స్వామివారు చిన్నశేష వాహనంపై విహరించారు. ఐదు తలల శేషవాహనంపై మలయప్పస్వామి శ్రీకృష్ణుడి రూపంలో మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అడుగడుగునా భక్తులు కర్పూరహారతులు సమర్పిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. మరోవైపు గోవింద నామస్మరణతో తిరుమల గిరులు మారుమోగాయి. ఇవాళ రాత్రి మలయప్పస్వామి వీణాపాణియై, సరస్వతీమూర్తిగా దర్శనమిస్తారు. హంస అనే పదానికి అనేకార్థాలు. బ్రహ్మ వాహనంగా హంస ప్రసిద్ధి. అంతే కాదు హంస అమలిన పవిత్ర విహంగమని పురాణాలు చెబుతున్నాయి. పరమాత్మలో లీనమైన మహనీయులను పరమహంసలని వ్యవహరించడమూ పరిపాటే. హంసకు సదాగమనశీలుడైన సూర్యుడనే అర్థమూ ఉంది. శ్రీమన్నారాయణుడు హంస శబ్ధ వాచ్యుడైన సూర్యుడిలో నివసిస్తున్నాడని పురాణ వచనం. సూర్యభగవానుడి ఆరాధన అంతరార్థమూ ఇదే. హంస వాహన రూఢుడైన శ్రీ వేంకటేశ్వరస్వామి సూర్యభగవానుడిలోని శ్రీమన్నారాయణుడికి ప్రతీక.