Araku Valley Roads Damage : అర్నాబ్ తుపాను అరకులోయ నియోజకవర్గంలో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు గ్రామీణ రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరద ప్రవాహానికి తారు రోడ్లు సైతం భారీగా కోతకు గురయ్యాయి. చాలా చోట్ల నిర్మాణ దశలో ఉన్న పలు రహదారులు వరద ఉద్ధృతికి కొట్టుకుపోయాయి. దీంతో ఏజెన్సీలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అరకులోయ మండలంలోని పిరిబంధ గ్రామానికి వెళ్లే రహదారి వరదలకు పూర్తిగా దెబ్బతింది. మరోవైపు కరకవలస గ్రామం సమీపంలో రోడ్డుపైకి భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కటికి జలపాతానికి వెళ్లే మార్గం పూర్తిగా మూసుకుపోయింది. ఈ మార్గంలో పడిన కొండచరియలను తొలగించి, రహదారిని పునరుద్ధరించడానికి కనీసం మూడు, నాలుగు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అరకులోయతో పాటు అనంతగిరి, డుంబ్రిగూడ, పెదబయలు మండలాల్లోనూ రహదారులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పరిస్థితుల తీవ్రతను గమనించిన అధికారులు వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. ఈదురుగాలులకు నేలకొరిగిన భారీ వృక్షాలను ఎక్కడికక్కడ తొలగిస్తున్నారు. దెబ్బతిన్న, కోతకు గురైన రోడ్లకు మరమ్మతులు చేసి రాకపోకలను పునరుద్ధరించే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు.
Comments