Tamil Nadu Cm Visits Vijayawada : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ విజయవాడలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న విజయ్‌కి పురపాలకశాఖ మంత్రి పి. నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఇంద్రకీలాద్రికి బయలుదేరారు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను విజయ్ దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా, ఎంపీ కేశినేని చిన్ని, దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఘనంగా ఆహ్వానించారు. ఆలయ ధ్వజస్తంభానికి మొక్కిన అనంతరం, అంతరాలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో విజయ్ పాల్గొన్నారు. వేదపండితులు ఆయనకు ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. విజయ్‌ను చూసేందుకు ఆలయ పరిసరాల్లో అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చి కేరింతలు కొట్టారు. దుర్గమ్మ దర్శనం అనంతరం తమిళనాడు సీఎం విజయ్, సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశం అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా రెండు అంశాల గురించి చర్చించారు. తెలుగుగంగ ద్వారా తాగునీరు, గోదావరి-కావేరి అనుసంధానంపై చర్చ జరిపారు. మరోవైపు విజయ్‌ను చూసేందుకు అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. అభిమానులకు విజయ్ అభివాదం తెలిపారు.