Actor Sharwanand On Indrakeeladri : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా ఉత్సవాలు ఈరోజు, పవిత్రమైన విజయదశమి రోజున ముగుస్తున్నాయి. అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకరించారు, తెల్లవారుజామున 2:30 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు.విజయదశమి పర్వదినం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ బాగా పెరిగింది. సినీ నటుడు శర్వానంద్, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, మాదిగ సంక్షేమ సహకార ఆర్థిక సంస్థ అధ్యక్షురాలు ఉండవల్లి శ్రీదేవి తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. విజయవాడ ఉత్సవ్ సీజన్-2లో భాగంగా బసవపున్నయ్య స్టేడియంలో ‘భోగి' చిత్రం యూనిట్ సందడి చేసింది. హీరో శర్వానంద్ నటించిన ‘భోగి' సినిమా టీజర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, కేశినేని వెంకట్, బోండా సిద్ధార్థ, శ్రీదేవి తదితరులు చిత్ర బృందంతో కలిసి పాల్గొన్నారు. విజయవాడ వచ్చినప్పుడల్లా సొంత ఇంటికి వచ్చినట్లు ఉంటుందని హీరో శర్వానంద్ చెప్పారు. సంక్రాంతి అంటే గోదావరి జిల్లాలు, దసరా అంటే విజయవాడనే స్థాయిలో ఈ ప్రాంతాలకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని అన్నారు. ‘భోగి’ సినిమా ప్రమోషన్లను విజయవాడలో ప్రారంభించడం అమ్మవారి అనుగ్రహంగా భావిస్తున్నట్లు చెప్పారు.