Deepam Indrakeeladri Temple : శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన పవిత్ర కార్తిక మాసం వైభవంగా ప్రారంభమైంది. కార్తిక శుద్ధ పాడ్యమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఆకాశదీపోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. ఆలయ ధ్వజస్తంభం వద్ద వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శివకేశవులను ఆవాహన చేస్తూ పవిత్ర ఆకాశదీపాన్ని వెలిగించారు. అనంతరం ఆ దీపాన్ని ధ్వజస్తంభం పైభాగానికి చేర్చారు. ఆకాశంలో మెరిసిన ఆ దీపకాంతులను చూసి భక్తులు పులకించిపోయారు. అనంతరం ఆలయ అధికారులు శ్రీ మల్లేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. శివకేశవుల తేజస్సుతో జగత్తులోని అజ్ఞానపు చీకట్లను తొలగించి, భక్తుల హృదయాల్లో ఆధ్యాత్మిక జ్యోతిని వెలిగించడమే ఈ దీపారాధనకు సంకేతమని అర్చకులు తెలిపారు. కార్తిక మాసం మొత్తం ఆలయంలో ప్రత్యేక పూజలు, దీపారాధనలు కొనసాగనున్నాయి.కార్తికమాసాన్ని భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు.డిసెంబరు 8 వరకు శివ, కేశవులను ఆరాధిస్తూ భక్తులు ఉపవాస దీక్ష చేస్తారు. పుణ్యస్నానం ఆచరించి నిత్యం తులసిచెట్టు వద్ద దీపం వెలిగిస్తారు. నదులలో స్నానం ఆచరించి శివకేశవులను దర్శించుకుంటే మంచి జరుగుతుందని భావించి ఎంతోమంది పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు.