No Due Certificate For Nominations : మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో పోటీ చేయాలనుకునే ఆశావహులు తమకు కావాల్సిన కీలక పత్రాలను సమకూర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ దాఖలు చేయడానికి ఎలాంటి ప్రభుత్వ లేదా మున్సిపల్ బకాయిలు ఉండకూడదనే నిబంధన ఉంది. ఈ నేపథ్యంలోనే ఆశావహులు తమ పేరిట ఉన్న ఆస్తి పన్ను, నీటి కుళాయి పన్ను బకాయిలను నయాపైసాతో సహా చెల్లిస్తున్నారు. మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ 'నో డ్యూస్' (బకాయిలు లేవు) సర్టిఫికెట్లను పొందుతున్నారు. ఈ ఎన్నికల సందడి వల్ల మున్సిపాలిటీలకు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పన్నుల రూపంలో భారీగా ఆదాయం సమకూరుతోంది. నామినేషన్ల గడువు ముగిసేలోపు ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు రాకుండా ఉండేందుకు అభ్యర్థులు ముందస్తుగానే అన్ని పత్రాలను సిద్ధం చేసుకుంటూ ప్రచార బరిలోకి దూకుతున్నారు. ఆశావహులకు ఇబ్బంది లేకుండా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆనంద్ ఎక్కడికక్కడ అధికారులను ఎన్నికల విధుల్లో నియమించారు. దరఖాస్తు చేసిన వారికి అరగంటలోపే పత్రాలు ఇచ్చేలా చర్యలు చేపట్టారు.
Comments