Parveta Utsavam Celebrated Grandly At Srikalahastiswara Temple : శ్రీకాళహస్తీశ్వరాలయంలో పార్వేట ఉత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామివారిని దర్శించేందుకు భక్తుల పోటెత్తారు. దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా తిరుపతి జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వరాలయంలో పార్వేట ఉత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. ఈ విశేష పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి సమేత శ్రీ వాయు లింగేశ్వర స్వామి వార్లను (ఆది దంపతులను) వివిధ రకాల దివ్యాభరణాలు, విశేష పుష్ప మాలలతో నయనమనోహరంగా అలంకరించారు. అనంతరం మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల నడుమ స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఆలయ మాడవీధుల్లో వైభవంగా ఊరేగించారు. ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కాలనీలు, వీధులన్నీ శివనామ స్మరణలతో మారుమోగిపోయాయి. ఉత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ముందస్తు ప్రత్యేక ఏర్పాట్లను పర్యవేక్షించారు. దీంతో ఉత్సవంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగింది. భక్తులందరు ఈ ఉత్సవాన్ని కన్నుల పండుగగా తిలకించారు.