Sridevi Sharannavaratri Celebrations Held Grandly At Srisailam : దేవీ నవరాత్రి పూజలు దేశమంతటా ఘనంగా జరుగుతున్నాయి. ఆలయాల్లో అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తూ పూజలు అందుకుంటున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని రోజుకో అలంకారంలో అలంకరించి పల్లకిసేవ నిర్వహిస్తారు. శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైల మహా క్షేత్రంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల తొలిరోజు శ్రీ భ్రమరాంబ దేవి శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు . ఆలయ ప్రత్యేక వేదికపై కొలువుదీరిన శైలపుత్రి అమ్మవారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. స్వామి అమ్మవార్లు భృంగి వాహనంపై కొలువుదీరి మంగళహారతులు అందుకున్నారు. కళాకారుల నృత్య సందడి నడుమ దేవదేవులకు శ్రీగిరి పురవీధుల్లో కనులపండువగా గ్రామోత్సవం జరిగింది. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు అమ్మవారు గాయత్రీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. గాయత్రిని మించిన మంత్రం లేదు, తల్లిని మించిన దైవం లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. గానం చేసిన వారిని కాపాడుతుంది కనుక ఈ మంత్రానికి గాయత్రి అనే పేరు. గాయత్రీదేవి వేదమాత. అన్ని మంత్రాలకు మూలశక్తి. అమ్మవారి దర్శనం కోసం తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఉచితంగా అన్ని క్యూలైన్లలో నుంచి భక్తులకు అనుమతి ఇస్తున్నారు. తొలి రోజు అమ్మవారిని లక్షమందికిపైగా భక్తులు దర్శించుకున్నారు.