Farmer Pumping Drainage Water : ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట చేతికందే దశలో ఎండిపోతుంటే ఆ రైతు తట్టుకోలేక పోయాడు. సాగు నీరు లేదు, భూగర్భ జలాలు అడుగంటాయి. ట్యాంకర్లతో నీటిని కొనుగోలు చేసే స్తోమత లేదు. దీంతో చివరకు మురుగు కాలువ నీటినే ఆశ్రయించాడు. ఏతం సాయంతో మురుగు నీటిని పొలానికి మళ్లిస్తూ పంటను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం శేరిపల్లికి చెందిన ఓ చిన్నకారు రైతు కూరాకుల కనకయ్య పంట కాపాడుకోడానికి నానా తిప్పలు పడుతున్నాడు.తనకున్న ఒకటిన్నర ఎకరాల భూమిలో వరి సాగు చేశాడు. పంట చేతికందే దశలో నీటి కొరత వెంటాడుతోంది. నింగివైపు చూస్తే వర్షం జాడ లేదు. భూమిలో చూస్తే నీటి ఊసే లేదు. మరోవైపు విద్యుత్తు సరఫరా సమస్యలు. కొంతమంది రైతులు ట్యాంకర్లతో నీటిని కొనుగోలు చేసి పంటలు తడుపుకుంటున్నారు. కానీ కనకయ్యకు అంత స్థోమత లేదు. దీంతో మురుగు కాలువ వద్ద ఏతం ఏర్పాటు చేసి నీటిని ఎత్తిపోస్తూ వరిమళ్లకు మళ్లిస్తున్నాడు.