Fire Breaks out in Cargo Vehicle in Prakasam District : ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపంలో జాతీయ రహదారిపై కార్గో వాహనంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఒంగోలు నుంచి కావలి వైపు వెళ్తున్న ఆర్‌ఎస్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ కార్గోకు చెందిన టాటా బడా దోస్త్ వాహనం కుంభకోణం కేఫ్ సమీపంలో అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుంది. విజయవాడ నుంచి చెన్నైకు స్వీట్ల సరకుతో వెళ్తున్న వాహనం ఏసీ భాగం నుంచి పొగ రావడంతో డ్రైవర్ ప్రవీణ్ వెంటనే అలర్ట్ అయి వాహనాన్ని నిలిపేసి కిందికి దిగాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న హైవే పోలీసులు, సింగరాయకొండ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. వాహనం పూర్తిగా కాలిపోయినప్పటికీ సుమారు 70 శాతం సరకును పోలీసులు, స్థానికులు బయటకు తరలించారు. ప్రమాద స్థలాన్ని సింగరాయకొండ సీఐ, ఎస్‌ఐ పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.