Film Actor Srikanth at Singarakonda : బాపట్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారిని సినీ హీరో శ్రీకాంత్ దర్శించుకున్నారు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం శంకరాపురం గ్రామంలో జరిగే గృహప్రవేశ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి బయల్దేరారు. ఈ క్రమంలో మార్గమధ్యంలోని శింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారిని దర్శించుకుని శ్రీకాంత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించి తీర్థప్రసాదాలు అందుకున్నారు. శ్రీకాంత్‌తో పాటు కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సినీ హీరో శ్రీకాంత్‌ను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. క్యూలైన్లో ఉన్నవారు సైతం తమ అభిమాన హీరోను చూసేందుకు పోటీపడ్డారు. సెల్ఫీలు దిగేందుకు ముందుకువచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం మొత్తం సందడి వాతావరణం నెలకొంది. శింగరకొండ విశేషాలు : శింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం బాపట్ల జిల్లా (గతంలో ప్రకాశం జిల్లా), అద్దంకి మండలంలోని శింగరకొండ వద్ద ఉంది. ఇది అద్దంకికి సుమారు 6 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ స్వామి వారు దక్షిణ ముఖంగా దర్శనమివ్వడం ఒక ప్రత్యేకత. లంకకు వెళ్లే మార్గంలో హనుమంతుడు ఇక్కడ విశ్రమించాడని భక్తుల నమ్మకం.
Comments